Back
INK POLITICS

ఓ కార్యకర్తా నీకు గుర్తింపేది? పార్టీ జెండా మోసి అలసిన బతుకుల ఆవేదన!

July 9, 2026
Political Rally and Workers

కార్యకర్త అంటే.. బీరు, బిర్యానీకి అమ్ముడు పోయేటోడు?, కార్యకర్త అంటే చివరి వరుసలో నిలబడేందుకు కూడా అర్హత లేనోడు, కార్యకర్త అంటే జెండా కూలీ మాత్రమే? ఇది కొంతమంది నాయకులలో.. పార్టీ కార్యకర్తల మీద ఉన్న అభిప్రాయం.

అసలైన కార్యకర్త అంటే...

  • లీడర్ పార్టీ మారినా, పార్టీ మారనోళ్లు..
  • పార్టీ ఓడినా జెండా విడవనోళ్లు..
  • ఎన్ని అవమానాలు ఎదురైనా, బెదిరింపులకు గురైనా బయపడనోళ్లు నికార్సైన కార్యకర్తలు.

ఇది ఒకప్పటి మాట..

ఇప్పుడు పార్టీలు మారి వచ్చేటోళ్లకే పైసలు, పనులు, కుర్చీలు, కాంట్రాక్టులు. నాయకుడిని మోసేటోనికే పదవులు, నాయకులతో పాటు పార్టీ మారేటోనికి సకల మర్యాదలు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారేటోళ్లకే ఇయ్యాల రేపు రాజకీయాల్లో గౌరవం, గుర్తింపు దక్కుతున్నాయి.

నేడు నిఖార్సైన కార్యకర్తలు పార్టీలకి అవసరం లేదన్నట్టుగా నాయకులూ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో.. నిజాయితీ గల కార్యకర్తలకు విలువ లేదు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ధైర్యంగా జెండాను భుజాన ఎత్తుకుని గర్వంగా చెప్పుకునే కార్యకర్తను, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని జెండా మోసే కూలీలుగా చులకనగా చూస్తున్నారు. పార్టీకి నమ్మిన బంటుగా ఉన్న కార్యకర్తలకు, అర్హత ఉన్నా సరే పక్కన పెట్టి.. పైసలిచ్చి పైరవీ చేసేటోళ్ళకి, వేరే పార్టీ నుండి వచ్చినోళ్ళకి, అర్హత లేనోళ్లకి, అసలు పార్టీతో సంబంధం లేనివాళ్లకు, తన వర్గానికి చెందిన అనుచరులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు.

"కార్యకర్తల శ్రమకు కొలమానం లేదు.
వారి త్యాగానికి ప్రతిఫలం లేదు."

"మా నాయకుడు దేవుడు, మా నాయకురాలు దేవత" అంటూ పొగిడినవ్, పిలిచినప్పుడల్లా ఉరుకురికి జెండాలు మోసినవ్, దండాలు పెట్టినవ్, ఫ్లెక్సీలు కట్టినవ్, శాలువాలు కప్పినవ్.. "ఏందయ్యా నువ్వింత చేసినా, వాళ్ళేం చేయట్లేదు నీకు" అంటుంటే, ఆ కార్యకర్త తన కుటుంబానికి ఏం సమాధానం చెప్పుకోవాలి?

వాళ్ళ మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. కన్న తల్లిదండ్రులకు, కట్టుకున్న భార్యకు, కన్న బిడ్డలకు సమాధానం చెప్పలేని కార్యకర్తలు.. ఇలాంటి నాయకులకూ, ఇలాంటి పార్టీ కోసమా మనం పని చేసిందని అవమాన భారంతో కుంగిపోతున్నారు.

"సవాళ్లు విసురుకునేది నాయకులు, బలయ్యేది మాత్రం కార్యకర్తలు."

ఒకప్పుడు నీతి, నిజాయితీతో కూడిన రాజకీయ నాయకులు ఉండేవారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి విలువల కొద్దీ రాజకీయం చేసేవారు. ప్రస్తుతం పార్టీలు కల్తీ అయ్యాయి, సిద్ధాంతాలు కరువయ్యాయి. అధికారమే జెండా, గెలుపే ఎజెండాగా పని చేస్తున్నారు.

అధికారం చేతులు మారినప్పుడు..

అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నాయకులు విందు, వినోదాల్లో, వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటూ హుందాగా వ్యవహరిస్తున్నారు.

కార్యకర్తల పరిస్థితి..

కార్యకర్తలు మాత్రం ఒకరి ముఖం ఒకరు చూసుకోలేని పరిస్థితి. ఒకరింటికి ఒకరు పోలేని పరిస్థితి. నాయకుల చేతుల్లో తోలు బొమ్మల్లా, ఎటు ఆడిస్తే అటు ఆడే మర మనుషుల్లా తయారవుతున్నారు.

నీ జీవితం నీదే, నీ కుటుంబం నీదే.. నీకు ఆపద వచ్చినప్పుడు నీ కుటుంబానికి న్యాయం చేస్తామని ఉచిత వాగ్దానాలు చేస్తారు, కాని చివరకు ఎవ్వరూ ఏమీ చేయరు.

ఎమ్మెల్యే గెలుపు కోసం ఇల్లిల్లూ తిరిగి ప్రచారం చేసేది మీరు.

ఎంపీ గెలుపు కోసం గడప గడపకూ తిరిగి ఓటెయ్యమని ప్రాధేయపడేది మీరు.

జెడ్పీటీసీలు, ఎమ్మెల్సీల గెలుపు కోసం వాడ వాడా పోస్టర్లు అంటించేది మీరు.

సర్పంచ్ గెలుపు కోసం అయిన వారిని కూడా దూరం చేసుకునేది మీరు.

ఇకపై ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ అధికారాన్ని అనుభవించాల్సింది కూడా మీరే.

ఈ రోజుల్లో సిద్ధాంతపరమైన పార్టీలు కరువయ్యాయి. ఒక పార్టీలో ఎక్కువ సంవత్సరాలు ఉంటే గుర్తింపు ఉంటుందనుకోవడం అవివేకం. నాయకులు మారిల్లు, నాయకులతో పాటు పార్టీల మనస్తత్వం కూడా మారింది. అధికారం వైపు పరుగులు పెడుతున్నాయి.

"ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేదు.. అన్ని పార్టీలల్లా గిదే జరుగుతుంది. ఆ నాయకుడు ఈ నాయకుడు అని తేడా లేదు, అందరు నాయకులు గట్లనే చేస్తున్నరు."

సభ్యత్వం ఎందుకు? అమ్ముకోడానికా?

అసలు పార్టీకి సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? దానివల్ల ఎవరికి ఉపయోగం? అధికారంలో ఉన్న పార్టీకి సభ్యత్వం అవసరం లేదు కానీ, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి అవసరం. మరి అలాంటప్పుడు, అధికార పార్టీని కాదని, ప్రతిపక్షంలో మీ పార్టీకి మద్దతు ఇస్తున్నడు, మీ పార్టీ సభ్యత్వం తీసుకున్నడంటే.. అతను నిజమైన కార్యకర్త కదా! అలాంటి వాళ్ళకి మీరేం చేస్తున్నారు?

పార్టీలో ఐదు, పదేళ్ల నుండి ఉంటున్నరు, ప్రతిసారీ సభ్యత్వం తీసుకుంటరు, ఓడిపోయినా విడిచిపోరు. అలాంటివాళ్ళకి రాజకీయ పార్టీల్లో గౌరవం ఉందా? అలాంటప్పుడు సభ్యత్వం ఎందుకు? నిఖార్సయిన కార్యకర్తల కష్టాన్ని తాకట్టు పెట్టడానికా? మా బలగం ఇంత ఉంది.. పార్టీకి ఫండ్స్ ఇవ్వండి అని సేకరించడానికా? లేక కార్యకర్తల బలం చూపించి పదవులు సంపాదించడానికా?

కార్యకర్తల ఆవేదన - ఆగ్రహం

మా పార్టీ ఓడిపోవాలని కొట్లాడినోడు, మా నాయకుడు గెలవొద్దని మొక్కినోడు, మమ్మల్ని చూసి హేళన చేసినోడు, మా నాయకుని పై విమర్శలు చేసినోడు ఈరోజు మా పార్టీలో చేరి, మా నాయకుని పక్కన కూర్చుని నవ్వుతుంటే ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియడం లేదని వాపోతున్నారు.

మేం ఎన్నో ఏళ్లుగా మా నాయకులను మోస్తున్నాం, నాయకుడు లేకపోయినా తలా ఓ చెయ్యేసి పార్టీని నిలబెట్టినం. పార్టీ రూపాయి ఇయ్యకపోయినా మా నాయకున్ని గెలిపించుకోవాలి, మా పార్టీ అధికారంలోకి రావాలని, సొంత పైసలు ఖర్చు పెట్టినం. పార్టీని మోసి మోసి అలసిపోయిన మా బతుకులకు జీవం నింపుతరు అనుకున్నాం.

పంట చేతికి వచ్చిన తర్వాత దుక్కి దున్నిన ఎడ్లకు మేత పెట్టకుండా, సంతకు పోయి బలిసిన ఎడ్లను బేరం చేసుకుని కొనుక్కొచ్చుకున్నట్టు.. నాయకులు గెలిచిన తర్వాత.. ఏళ్లతరబడి పోరాడి అలసిన కార్యకర్తలను పనికిరావని చెప్పి పక్కన పెట్టి, వేరే పార్టీలో అధికారాన్ని హాయిగా ఆస్వాదించి, ప్రజాధనాన్ని దోచుకున్న నాయకులను తీసుకొచ్చి, మా పక్కన కూర్చోపెట్టి, వాళ్ళకి పదవులు ఇచ్చి, మమ్మల్ని అవమానించి, ఆగం చేసి పార్టీకి దూరం చేస్తున్నారు. ఇదేనా మీరు కార్యకర్తలకు చేసే న్యాయం? ఇదేనా మీ పార్టీలు కార్యకర్తలకు ఇచ్చే మర్యాద? అంటూ ఆగ్రహానికి గురవుతున్నారు.

"సమయం వచ్చినప్పుడు కార్యకర్తల సత్తా ఏంటో చూపిస్తాం, మీ అధికార గర్వాన్ని, అహంకారాన్ని అణగదొక్కుతాం. మేము మీవల్ల లాభపడింది ఏం లేదు. ఎలాగూ నష్టపోయాం, ఇంకా నష్టపోయేదేం లేదు. నిఖార్సైన కార్యకర్తలను దూరం పెట్టి, వలసవాదులతో కలిసి ఎలా గెలుస్తారో చూస్తాం. మీకు అధికారం దూరమైతే, ఓటమితో ఒంటరైతే అప్పుడైనా కార్యకర్తల విలువ తెలుస్తుంది."

చివరి వరకు పార్టీలో ఉండేదెవరు, మీరు ఓడిపోయిన వెంటనే పార్టీ మారేది ఎవరో తెలుస్తుందని వారి అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. పార్టీని గెలిపించి తాను ఓడిపోతూ కూడా, ఇంకా ఆ జెండానే పట్టుకుంటూ తన గుర్తింపు కోసం ఎదురుచూస్తున్నాడు. అధికార పార్టీ అసంతృప్త కార్యకర్తలను అక్కున చేర్చుకుని బలం పెంచుకునేందుకు ప్రతిపక్ష పార్టీలకు మంచి అవకాశంగా మారుతుంది.

"కసితో పనిచేసే కార్యకర్తలు.. పార్టీని గెలిపించే వరకు శ్రమిస్తూనే ఉంటారు."

ఓ కార్యకర్తా.. నువ్వు మారాల్సిన సమయం ఆసన్నమైంది!

అవకాశాలకు తగ్గట్టుగా, అవకాశవాద నాయకుల మాదిరిగానే నువ్వూ మారాలి. నువ్వు నీ పార్టీని కాపాడాలని ప్రశ్నిస్తే.. ఒంటరిని చేసి, నిన్ను పార్టీ నుండి వెళ్లగొడతారు.. నీ వాదనను వినేవాళ్లు ఉండరు.

"ఏ పార్టీకైనా ఎన్నికలప్పుడు గెలిపించేందుకు కష్టపడే ఎడ్లు కావాలి, గెలిచిన తర్వాత మాత్రం సంచులు మోసే గొడ్లు కావాలి."

ప్రస్తుతం నాయకులకు కావాల్సింది కష్టపడే ఎడ్లు కాదు, బలిసిన గొడ్లు! పార్టీ సిద్ధాంతాలకు కాలం చెల్లింది.. ఇక నుండి వ్యక్తిగత సిద్ధాంతాల పై బలంగా పోరాడు.

  • ఏ పార్టీ కార్యకర్తలైనా సరే.. మీలో మీకు విద్వేషాలు వద్దు, నాయకుల కోసం మిమ్మల్ని మీరు బలి పశువులను చేసుకోవద్దు.
  • ఈరోజు మీ శత్రువు అనుకున్న అవతలి పార్టీ కార్యకర్త, రేపు నీ పార్టీలోకి వస్తడు, లేదా నువ్వే ఆ పార్టీలోకి వెళ్లొచ్చు, అందుకే పార్టీలు వేరైనా, అధికారం చేతులు మారినా, ఒకరికి ఒకరు సహాయం చేసుకోండి. అధికారాన్ని అనుభవించండి.
  • మీకు, మిమ్మల్ని నమ్మిన ప్రజలకి అన్యాయం జరిగితే ప్రశ్నించండి, ఏ పార్టీలో ఉన్నా ప్రజలకు న్యాయం చేయండి.

"పార్టీ సిద్ధాంతాలను బలపరిచే నాయకత్వం పెరగాలని, కార్యకర్తలను గౌరవించే పార్టీలు రావాలని కోరుకుందాం."

Vamshi BTech

ఈ ఆర్టికల్ ను ప్రతి కార్యకర్తకూ చేరవేయండి!

ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితమైన సమస్య కాదు. జెండాలు మోసి అలసిపోయిన ప్రతి నిఖార్సయిన కార్యకర్త ఆవేదన. ఈ కథనాన్ని మీ తోటి మిత్రులకు, వాట్సాప్ గ్రూపుల్లో పంచుకోండి.